ధ్యానం ద్వారా సత్ప్రవర్తన వస్తుందనడం అవాస్తవమట!
Advertisement
ధ్యానం మనుషుల్లో మార్పు తెస్తుందని, ధ్యానం అలవాట్లను మారుస్తుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పరిశోధనలో తేలింది. ధ్యానం ద్వారా మనుషుల్లో సత్ప్రవర్తన వస్తుందనడం కేవలం అపోహ మాత్రమేనని బ్రిటన్‌ లోని కోవెన్ట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ‘ధ్యానం వల్ల ప్రశాంతత, కరుణ వంటి భావనలు వస్తాయా? లేదా?’ అనే అంశంపై గతంలో నిర్వహించిన 20 అధ్యయన ఫలితాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, మెడిటేషన్‌ ద్వారా సానుకూల దృక్పథం వస్తుందని తొలుత భావించినా, దీనిలో సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయని వారు గుర్తించారు.

గతంలో నిర్వహించిన పరిశోధనల్లో మెడిటేషన్‌ చేసే బృందం, మెడిటేషన్ చేయని బృందం ఫలితాలను విడివిడిగా పరిశీలించిన అనంతరం, మెడిటేషన్‌ టీచర్లు తాము నిర్వహించిన అధ్యయనాల్లో ధ్యానం గురించి పాజిటివ్‌ గా రాసినట్లు నిర్థారించుకున్నారు. ఎందుకంటే మెడిటేషన్‌ చేసేవారు ఎలాంటి పనులు చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే సానుకూల దృక్పథంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారని ఈ ఫలితాల్లో తేలినట్టు గుర్తించారు.

వారే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తమ దూకుడు స్వభావం, పక్షపాత వైఖరిని అదుపు చేసుకోలేకపోతున్నట్లు స్పష్టమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో సత్ప్రవర్తనకు, ధ్యానానికి సంబంధం లేదని తేలిందని వారు పేర్కొన్నారు. ధ్యానం ద్వారా ఒక వ్యక్తి స్వభావం, భావనలు ఇతరుల మీద ఎలా ప్రభావం చూపుతాయనే అంశం మీద మరింత లోతైన అధ్యయనం చేస్తున్నామని కోవెన్ట్రీ యూనివర్సిటీకి చెందిన మిగైల్‌ ఫారిస్‌ తెలిపారు. ఈ పరిశోధన వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌ లో ప్రచురితమయ్యాయి.
Tue, Feb 06, 2018, 07:22 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View