క్యూరియాసిటీ ఐదేళ్ల జర్నీని తెలిపే స్టన్నింగ్ ఫొటో!
Advertisement
Advertisement
అరుణగ్రహ అందాలు, అక్కడి వాతావరణం, అక్కడి ఒకప్పటి భౌగోళిక పరిస్థితులు, ప్రస్తుత మానవ ఆవాసం సాధ్యాసాధ్యాలు తదితర అంశాలపై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఎట్టకేలకు ఐదేళ్ల తన సుదీర్ఘ పరిశోధనను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన ఫొటోతో తెలిపింది. అంగారకుడిపై నీలిరంగులో కనువిందు చేసే సూర్యాస్తమయాలు, రుధిర వర్ణంతో కూడిన ఇసుక దిబ్బలు, చిన్నసైజులో, సమూహాలను తలపించే చంద్రతారకల మధ్య క్యూరియాసిటీ రోవర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు 1856 మార్టియన్ రోజుల (అంగారకుడిపై సౌర దినాలు)ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

అంగారకుడిపై ఒకప్పటి పురాతన సరస్సు ఒడ్డున నుంచి తీసి పంపిన ఈ ఫొటో అద్భుతంగా ఉంది. గత అక్టోబరులో క్యూరియాసిటీ రోవర్ గుర్తించిన ఈ ఫొటోని నాసా ఈ వారంలో రిలీజ్ చేసింది. మౌంట్ షార్ప్ దిగువన ఉన్న వాలుతలాల నుండి రోవర్ దీనిని తీసి పంపింది. క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సుమారు 11 మైళ్ల మేర దూరాన్ని చేరుకుంది.

అంగారకుడిపై రోవర్ సేకరించిన డేటా ప్రకారం, అరుణగ్రహం ఒకప్పుడు ప్రవహించే నదులు, అందమైన సరస్సులతో కూడి ఉండేది. రోవర్ పంపిన పలు గ్రహణ ఛాయాచిత్రాలు, గాలిదెయ్యాలను తలపించే దుమ్ముధూళి దృశ్యాలు, క్రమపద్ధతిలో చూడచక్కగా అమరిన ఇసుక దిబ్బలను పరిశీలిస్తే ఇప్పటికీ అరుణ గ్రహం ఒక అందమైన ప్రదేశంగా ప్రపంచానికి అనుభూతిని కల్గిస్తుంది.

క్యూరియాసిటీ పంపిన ఫొటోలో కొన్ని నెలల కిందటే రోవర్ దాటిన పలకలు పలకలుగా ఉండే బాగ్‌నోల్డ్ డ్యూన్స్ మనం చూడొచ్చు. 1174 మార్టియన్ రోజున ఈ బాగ్‌నోల్డ్ ఇసుకదిబ్బల క్షేత్రాన్ని రోవర్ చేరుకుంది. సదరు ఇసుక దిబ్బల నడుమ క్యూరియాసిటీ కొన్ని నెలల పాటు అటూఇటూ తిరుగుతూ ఫోటోలు క్లిక్‌మనిపించే పనిలో నిమగ్నమయిపోయింది.

కొన్ని మైళ్ల మేర విస్తరించిన గాలిధూళి కణాలతో నిండిన ఈ ఇసుక దిబ్బలు ఒక రకంగా మౌంట్ షార్ప్ గమ్యస్థానానికి చేరుకునేటపుడు రోవర్‌కు ఇబ్బందులు కల్గించాయని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. 2016 ఆఖరు నాటికి క్యూరియాసిటీ ఎలాగోలా ఇసుక దిబ్బల ఇబ్బందులను అధిగమించింది. రోవర్ తన లేజర్ సాయంతో అక్కడ బోరాన్ ఆనవాళ్ల కోసం అన్వేషించింది. తర్వాత అటు నుండి మౌంట్ షార్ప్‌ చేరుకుని, ప్రస్తుతం అక్కడ కూర్చునే ఈ అద్భుతమైన ఫొటోను నాసాకు పంపింది.

తర్వాత 1597 మార్టియన్ రోజున గాలే క్రాటర్ (గాలే బిలం)కి సంబంధించిన కనుమల వెంట కన్పించిన వేగంగా ప్రయాణిస్తిున్న దుమ్ముధూళి కణాల దృశ్యాలను ఒక వీడియోలో బంధించిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. 2015 మొదట్లో టెలిగ్రాఫ్ పీక్ వద్ద డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో క్యూరియాసిటీ రోవర్ చెడిపోయింది. ఫలితంగా కొన్ని రోజుల పాటు పరిశోధనకు బ్రేకు పడింది. మరోవైపు ఫోబోస్ అనే చంద్రుడితో పాటు అంగారకుడికి రెండు చంద్రులు ఉండటాన్ని కూడా రోవర్ గుర్తించింది. దానితో పాటు దాదాపు ప్రతిరోజూ ఒక సూర్య గ్రహణం సంభవిస్తుండటం కూడా గుర్తించగలిగింది. ఈ ప్రాజెక్టు కోసం నాసా 2.5 బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించిన సంగతి తెలిసిందే.
Mon, Feb 05, 2018, 01:55 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View