కేన్సర్ రోగులకు శుభవార్త... వ్యాక్సిన్‌లతో రోగాన్ని అడ్డుకునే ఛాన్స్!
Advertisement
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి రోగులకు ఇది కచ్చితంగా శుభవార్తే అవుతుంది. ఎందుకంటే, ఈ మహమ్మారిని వ్యాక్సిన్‌లతో కట్టడి చేసే అవకాశముందని పరిశోధకులు తాజాగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోగానికి చికిత్సా మార్గాలుగా ఇప్పటివరకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అందుబాటులో ఉన్నాయి. బాధతో కూడుకున్న ఈ చికిత్సా పద్ధతులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయగలిగేవి కావు.

కానీ, త్వరలోనే పెద్దగా బాధ లేకుండానే సులభమైన రీతిలో ఒక సమర్థవంతమైన వ్యాక్సిన్‌తో ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చని ఇక్కడ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలోని పరిశోధకులు, వైద్య నిపుణులు అంటున్నారు. తాము తయారు చేసిన ఒక కాంపౌండ్‌ని వ్యాక్సిన్ రూపంలో ఏదైనా కేన్సర్ కణతిలోకి ఎక్కించడం ద్వారా దానిని నాశనం చేయవచ్చని వారు చెబుతున్నారు. అంతేకాక శరీరంలోని ఇతర కేన్సర్ కారక పదార్థాలను కూడా ఈ వ్యాక్సిన్ విచ్ఛిన్నం చేయగలదని వారంటున్నారు.

దీనిని తొలుత ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించినట్లు వారు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే మానవులపై ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. రెండు రసాయనాల సాయంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించినపుడు ఇందులోని రెండు రసాయనాలు దాని రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడంతో పాటు దాని శరీర స్పందనకు దోహదం చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ను ప్రయోగించిన ప్రదేశంతో పాటు ఇతర ప్రదేశాల్లోని కేన్సర్ కణతులు కూడా నాశనమైపోయినట్లు వారు చెప్పారు.

ఈ రకంగా చూస్తే, ఎలుకలపై చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని, త్వరలోనే మనుషులపై కూడా ప్రయోగించడానికి అవకాశమేర్పడిందని వారు తెలిపారు. ప్రాథమికంగా...15 మంది లింఫోమా రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తామని వారు చెప్పారు. సానుకూల ఫలితాలు రాగలవని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. లింఫోమా సమస్య ఉన్న 90 ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించామని, వాటిలో 87 ఎలుకలు కేన్సర్ నుండి విముక్తి పొందాయని, ప్రప్రథమ చికిత్సకే ఇది సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు.

రెండో దఫా చికిత్సతో మిగిలిన మూడు ఎలుకలు కూడా కేన్సర్ భూతం నుండి బయటపడ్డాయని వారు తెలిపారు. ఈ కొత్త వ్యాక్సిన్ విధానం ప్రధానంగా కేన్సర్ కణాలపై పోరాడేలా ఒక కచ్చితమైన వ్యాధి నిరోధక కణాలు పునరుత్తేజితమయ్యే విధంగా చేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆంకాలజీ ప్రొఫెసర్ రొనాల్డ్ లెవీ చెప్పారు.
Mon, Feb 05, 2018, 11:43 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View