భయపడొద్దు.. ఏమీ తెలియని వారే గజగజా వణికిపోతారు!: చంద్రగ్రహణంపై బాబు గోగినేని సందేశం
Advertisement
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆకాశంలో అత్యంత అరుదైన రూపంలో చంద్రుడు కనపడుతుంటే దాన్ని చూస్తూ హర్షం వ్యక్తం చేస్తోన్న వారు కొందరైతే.. ఏదైనా అరిష్టం జరుగుతుందేమోనని ఇంట్లోనే ఉండి కొందరు భయపడిపోతున్నారు. ఆచారం ప్రకారం సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు మూతపడ్డాయి. గ్రహణం సమయంలో దేవతల శక్తి నశిస్తుందని ప్రజల విశ్వాసం. దీనిపై హేతువాది బాబు గోగినేని ఓ వీడియోను యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

గ్రహణానికి ముందు జ్యోతిష్యులందరూ టీవీ చానెళ్లలోకి వచ్చి ఏవో చెప్పి జనాలని భయపెట్టి ఇంటికి వెళ్లిపోతున్నారని బాబు గోగినేని అన్నారు. "ఆ కాలంలో గ్రహణం ఎందుకు వస్తుందో తెలియక ఎన్నో ఊహించుకుని ప్రజలు భయభ్రాంతులకు గురైన మాట నిజమే.. కానీ ఈ రోజు తెలుసు కదా.. ప్రతి 6,585 రోజులకి ఇటువంటి ప్రక్రియ కనపడుతుంది.

ఇప్పుడు కనపడి మళ్లీ 6,585 రోజులకి ఈ దృశ్యం కనపడుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్నారు.. సూర్యుడి కాంతి భూమిపై పడుతుంది. భూమి మీద కాంతి పడితే భూమి వెనుక నీడ ఉంటుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు.. కాబట్టి ఈ నీడ చంద్రుడిపై పడుతుంది.. దీంతో ఈ సమయంలో చంద్రుడు కనపడడు. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు కాబట్టి చంద్రుడు కనపడడు.. అంతే.. నీడకి భయపడితే ఎలా మన దేశంలో? ఇటువంటి భయాలు ఎందుకు? భయాలన్నీ కేవలం జ్యోతిష్యులు కల్పించిన అసత్యాలు. తలుపులేసుకుని ఇంట్లో కూర్చుని భయపడకూడదు.. ఇందులో సైన్స్ ఉందని ఇలా చేయడం సరైందేనని కూడా కొందరు చెప్పుకుంటున్నారు" అని బాబు గోగినేని అన్నారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ జోతిష్యులు డబ్బులు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తన రాశి ప్రకారం ఈ రోజు గ్రహణం సమయంలో తనకు ఏదో కీడు జరుగుతుందని జ్యోతిష్యులు అంటున్నారని తెలిపారు. తాను కాసేపట్లో తన మేడపైకి వెళ్లి సమోసా తింటూ చంద్రగ్రహణాన్ని చూస్తానని, తనకు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. ఎవ్వరూ భయపడొద్దని, భయపడేవారు ఇంట్లో తలుపులు వేసుకుని గజగజా వణుకుతూ ఉంటారని, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలిసిన వారు కూడా అదే పని చేస్తే జ్ఞానానికి అర్థం ఉండదని చెప్పారు.  
Wed, Jan 31, 2018, 06:51 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View