ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తల అద్భుతం..ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్!
Advertisement
ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని ప్రొఫెసర్ భానుభూషణ్, పీహెచ్ డీ స్కాలర్ సుమంతా కుమన్ కరణ్ కలసి రూపొందించినట్టు నానో ఎనర్జీ జర్నల్ ప్రచురించింది. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్త జిన్ కోన్ కిమ్ ఆధ్వర్యంలో ఈ పరికరాన్ని ఇటీవల విజయవంతంగా పరీక్షించినట్టు ఆ జర్నల్ లో పేర్కొంది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ భానుభూషణ్ మాట్లాడుతూ, పెద్ద ఎత్తున ఉల్లిపొట్టు వృథా అవుతుందని గుర్తించడం వల్లే ఈ ప్రయోగం ప్రారంభించామని అన్నారు. ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉందని, ఈ పరికరానికి ‘నానో జనరేటర్’ అని నామకరణం చేసినట్టు తెలిపారు. ఉల్లిగడ్డ పొట్టులోని పియోజ్ ఎలక్ట్రిక్ గుణాలతో ఈ పరికరం పని చేస్తుందని, పియోజ్ ఎలక్ట్రిక్ పదార్థాలకు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే శక్తి ఉందని అన్నారు. హాఫ్ ఇంచ్ ఉల్లిపొరతో 20 వోల్టుల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఆరు ఉల్లిగడ్డల పొట్టుతో 80 ఎల్ఈడీ బల్బులను వెలిగించవచ్చని, లాప్ టాప్ మొబైల్ ఫోన్స్ ను కూడా చార్జ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టెక్నాలజీని అందరూ వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
Tue, Dec 19, 2017, 03:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View