శత్రువును చీల్చి చెండాడే 'రైల్ గన్స్'.. డీఆర్డీవో నూతన ఆవిష్కరణ!
Advertisement
ధ్వని వేగానికి ఆరు రెట్ల అధిక వేగంతో తూటాల వర్షం కురిపించే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తయారు చేసింది. వీటిని ఎలక్ట్రో మాగ్నెటిక్ రైల్ గన్స్ గా డీఆర్డీవో పేర్కొంది. ఈ రైల్ గన్స్ గంటకు 7400 కిలోమీటర్ల వేగంతో గుళ్ల వర్షం కురిపించి విధ్వంసం సృష్టిస్తాయని తెలిపింది.

క్షణాల వ్యవధిలోనే శత్రుమూకలను తుత్తునియలు చేసేందుకు వీటిని తయారు చేసినట్టు డీఆర్డీవో వెల్లడించింది. సుదూర లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదిస్తాయని వీటిని తయారు చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు. విద్యుదయస్కాంత శక్తితో పనిచేసే ఈ రైల్‌ గన్స్‌తో బాంబులు, పేలుడు పదార్థాల అవసరం లేకుండానే శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చని వారు తెలిపారు.

ప్రస్తుతం 12 మిల్లీమీటర్ల వ్యాసంతో ఈ రైల్‌ గన్‌ గొట్టాలను తయారుచేశామని వారు చెప్పారు. భవిష్యత్తులో ఈ గన్ గొట్టాల వ్యాసాన్ని 30 మిల్లీమీటర్లకు పెంచుతామని డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ ఆయుధాలు సరికొత్త ఆయుధ విప్లవానికి నాంది పలుకుతాయని వారు అభిప్రాయపడ్డారు.
Thu, Nov 09, 2017, 08:24 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View