మరో రెండు దశాబ్దాలలో చంద్రుడిపై ఓ గ్రామం.. ఆ గ్రామంలో వంద మంది నివాసం... ఎలా ఉంటారో తెలుసా?
Advertisement
సరిగ్గా మరో 23 ఏళ్లలో చంద్రుడిపై ఒక ఊరు ఏర్పడనుందని, అందులో వంద మంది నివాసం ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాలిస్టిక్ సముద్రపు ఒడ్డున యూరోపియన్ యూనియన్ లో లుధియానా, ఎస్టినో దేశాల మధ్యనున్న లాత్వియా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ దేశ రాజధాని రిగాలో ఈ విషయం తెలిపారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన మూన్ విలేజ్ స్కీమ్ అంబాసిడర్ బెర్నార్డ్ ఫోయింగ్, యురోపియన్ ప్లానెటరీ సైన్స్ కాంగ్రెస్‌ లో మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ల తరహాలో చంద్రుడిపై మనిషి నివాసం ఏర్పరచుకుంటాడని తెలిపారు.

రైల్వే వ్యవస్థ ఆచరణలోకి వచ్చిన కొత్తలో రైళ్లు ఆయా ఊర్లలో ఆగడం కోసం ఊరు శివార్లలో రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్టేషన్ లో పని చేసే సిబ్బందికి అక్కడే ఇళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ స్టేషన్ మీదుగా ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రజలు, మరింత సౌలభ్యం కోసం ఆ రైల్వే స్టేషన్ కు దగ్గర్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. అలా ఆ చుట్టూ కొన్ని ఇళ్లు ఏర్పాటు కావడంతో  ఆ ప్రాంతమే ఒక ఊరుగా మారింది. అచ్చం అదే తరహాలో చంద్రుడిపై ఊరు ఏర్పడుతుందని ఆయన తెలిపారు.

2030 నాటికల్లా ఆరు నుంచి పది మంది సైంటిస్టులు, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ వంటి నిపుణులు చంద్రుడిపై ఈ విధంగా నివాసం ఏర్పాటు చేసుకుంటారని ఆయన తెలిపారు. 2040 నాటికి ఇది వందకు పెరుగుతుందని ఆయన చెప్పారు. 2050 నాటికి అక్కడ వెయ్యి మంది నివసించవచ్చని ఆయన జోస్యం చెప్పారు. అంతే కాకుండా, మరి కొన్ని దశాబ్దాలలో చంద్రుడిపైనే పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

నీళ్ల కోసం అక్కడ ఘనీభవించిన మంచును కరిగించుకుంటారని, ఇళ్ల నిర్మాణానికి 3డీ ప్రింటింగ్‌ ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే, అక్కడే పండించిన పంటలను ఆహారానికి వాడుకుంటారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇప్పటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ స్థానంలో చంద్రుడిపైనే శాశ్వత నివాసం ఏర్పరచుకోవడమే యురోపియన్ స్పేస్ ఏజెన్సీ లక్ష్యం అని ఆయన తెలిపారు.
Fri, Sep 22, 2017, 04:15 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View