రోజూ అరగంట ఇంటి పని చేయండి.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది!: తాజా అధ్యయనం సూచన
Advertisement
ఆరోగ్యం మహా భాగ్యం.. ఇది ఒక్కటీ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌కు వెళ్తే, మరికొందరు జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తుంటారు. అయితే ఇకనుంచి ఇవన్నీ మానేసి రోజూ చక్కగా అరగంట పాటు ఇంటి పనులు చేయడం ద్వారా మృత్యువు మీ  సమీపంలోకి రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేకాదు గుండె జబ్బులను కూడా ఇది 20 శాతం దూరం చేస్తుందని ‘ది లాన్సెట్’ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 1.30 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఇందులో భారత్‌లోని నాలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వారానికి 150 నిమిషాల ఇంటి పనులతో పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనం తెలిపింది. బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం, గార్డెనింగ్ చేయడం వంటి చిన్నచిన్న పనుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనకారులు పేర్కొన్నారు.

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఇంటి పనులు చేయడం వల్ల డెత్ రిస్క్‌ను 28 శాతం తగ్గించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే గుండె జబ్బులను 20 శాతం నివారించవచ్చని తేలిందని చెన్నైలోని సెయింట్ పాల్  ఆసుపత్రి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ స్కాట్ లీర్ తెలిపారు. దేశంలో సగానికి సగం మందికి సరైన శారీరక శ్రమ లేదని చెన్నైకే చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఆర్ఎం అంజన తెలిపారు. నడవడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, ఇంటి పనులు చేయడం వల్ల సరిపడా వ్యాయామం రాదనే ఆలోచన తప్పని అంజన వివరించారు.
Fri, Sep 22, 2017, 09:06 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View