దంపతుల్లో నిద్రలేమి శృంగారాన్నే కాదు.. ఆరోగ్యాన్నీ దారుణంగా దెబ్బతీస్తుంది!
దంపతుల్లో నిద్రలేమి రొమాన్స్‌నే కాదు, ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని అమెరికాలోని ఓహియోలోని స్టేట్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ బిహేవియర్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. దంపతుల్లో నిద్రలేమి ఒత్తిడి సంబంధ సమస్యలను పెంచుతుందని తమ అధ్యయనంలో తేలినట్టు వారు పేర్కొన్నారు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, కీళ్ల నొప్పులతోపాటు ఇతర రోగాలకు కూడా అది కారకమవుతుందని వివరించారు. నిద్రలేమి పలు రోగాలకు కారణమన్న విషయం అందరికీ తెలిసిందే కావడంతో దాని ప్రభావం దంపతుల్లో ఎలా ఉంటుందో తెలుకునేందుకే ఈ అధ్యయనం నిర్వహించినట్టు అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించిన స్టీఫెన్ విల్సన్ తెలిపారు.

అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 43 జంటలను ఎంచుకున్నారు. వారిపై రెండుసార్లు అధ్యయనం నిర్వహించారు. ప్రతిసారి వారి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా గత రెండు రాత్రుల్లో వారెంత సమయం నిద్రపోయారో తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా సరిగా నిద్రపోని వారిలో మార్పు వచ్చినట్టు గుర్తించారు. సహజానికి భిన్నంగా వారు ఉన్నట్టు కనుగొన్నారు. నిద్రపోయే సమయం తగ్గిన ప్రతీ గంటకు వారిలో ఇన్‌ప్లమేటరీ మార్కర్లు ఆరు శాతం పెరిగినట్టు గుర్తించారు. అది క్రమంగా దీర్ఘకాలిక జబ్బులు దారి తీసే అవకాశం ఉందని అధ్యయనకారులు కనుగొన్నారు.

నిద్రలేమి అనేది దంపతుల నిత్య జీవితంలో ఓ సమస్యగా మారిందని విల్సన్ పేర్కొన్నారు. నిజానికి రోజుకు ఏడు గంటలు నిద్రపోవాల్సి ఉండగా తమ పరిశోధనలో దంపతులు అంతకంటే తక్కువే నిద్రిస్తున్నట్టు తేలిందన్నారు. దంపతుల్లో ఒకరు రెస్ట్ లెస్‌గా ఉన్న, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా అది భాగస్వామి నిద్రపైనా ప్రభావం చూపిస్తుందని వివరించారు. కాబట్టి దంపతుల మధ్య బంధాన్ని మరింత దృఢతరం చేసే దారులు వెతకాలని, నిద్రలేమికి సమస్యేంటో గుర్తించి పరిష్కరించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Fri, Jun 30, 2017, 09:06 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View