కేసీఆర్ సూచన మేరకే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక!
ఎన్డీఏ త‌మ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవిద్‌ పేరును ప్ర‌క‌టించిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఫోను చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌తో మోదీ ఏం మాట్లాడార‌న్న విష‌యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ‘మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం’ అని కేసీఆర్‌కు మోదీ ఫోన్లో చెప్పార‌ని అందులో పేర్కొంది. త‌మ‌ పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా బ‌రిలోకి దిగుతున్న నాయ‌కుడికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను మోదీ ఫోన్ కోరారని తెలిపింది.

మోదీ నుంచి ఫోన్ వ‌చ్చిన అనంత‌రం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చ‌ర్చించి, ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశార‌ని, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి తమ పూర్తి మద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంది.      
Copyright © 2017; www.ap7am.com