విమానాన్ని కుదిపేసిన తీవ్ర గాలులు...లగేజి పడి ప్రయాణికులకు గాయాలు!
విమానాన్ని గాలి చుట్టుముట్టి అతలాకుతలం చేయడంతో ప్రయాణికులు గాయపడిన ఘటన చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంయూ 774 విమానంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చైనాలోని ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంయూ 774 విమానం ఫ్రాన్స్ లోని ప్యారిస్ నుంచి చైనాలోని కున్మింగ్ కు బయల్దేరింది. మార్గ మధ్యంలో విమానాన్ని బలమైన గాలులు చుట్టుముట్టాయి. దీంతో పైలట్ ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాలని హెచ్చరించడంతో అంతా సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. ఇంతలో బలమైన గాలులు రెండు సార్లు, ఒక మోస్తరు గాలులు మూడు సార్లు టర్బోలైన్స్ ను ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని లగేజీ లాకర్లు వాటంతట అవే తెరుచుకున్నాయి.

దీంతో అందులోని లగేజీ నేరుగా కింద కూర్చున్న ప్రయాణికులపై పడింది. పర్యవసానంగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 26 మంది ప్రయాణికులు ఈ ఘటనలో గాయపడగా, నలుగురికి బలమైన గాయాలయ్యాయి. ఇందులో కొందరికి ఎమకలు కూడా విరిగాయని తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ కాగానే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్సనందిస్తున్నామని తెలిపింది. ఈ వారంలో తమ విమానం గాలుల్లో చిక్కుకోవడం రెండో సారి జరిగిందని, గత 11న ఆస్ట్రేలియా వెళ్తున్న విమానం కూడా ఇలా బలమైన గాలుల బారిన పడిందని తెలిపారు.
Copyright © 2017; www.ap7am.com