కప్ ఓడిపోయినా.. పాకిస్థానీల మనసులు గెలుచుకున్న కోహ్లీ!
ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోలేక పోయినప్పటికీ... పాకిస్థాన్ అభిమానుల మనసులను మాత్రం టీమిండియా కెప్టెన్ కోహ్లీ గెలుచుకున్నాడు. మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ పాక్ జట్టును అభినందించాడు. ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లు పడి లేచిన తీరు అద్భుతంగా ఉందని... పాక్ లో ఎంత టాలెంట్ ఉందో ఈ విజయం తెలియజేస్తోందని కోహ్లీ అన్నాడు. వాళ్లదైన రోజున పాక్ ఆటగాళ్లు ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేస్తారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్ ద్వారా అది మరోసారి నిరూపితమైందని చెప్పాడు.

ఆ విధంగా తమ జట్టుపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెట్ అభిమానుల మనసులను దోచుకున్నాయి. దీంతో, కోహ్లీ గొప్పదనాన్ని ట్విట్టర్లో తెగ మెచ్చుకుంటున్నారు పాక్ అభిమానులు. "కోహ్లీ, నీ వ్యాఖ్యలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నావ్. నీవు గొప్ప ఆటగాడివే కాదు, జెంటిల్ మెన్ వి కూడా", అంటూ ముబాషర్ అనే అభిమాని ట్వీట్ చేశాడు.Copyright © 2017; www.ap7am.com