బార్ లో క్రికెట్ వివాదం... పగిలిన బాటిళ్లు, గాయాలపాలైన అభిమానులు!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులో అభిమానులను గాయాలపాల్జేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో గల మధురా బార్ లో క్రికెట్ అభిమానులు బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ చూశారు. ఓటమిపాలు కావడంతో బార్ లో కూర్చున్న ఒక బ్యాచ్ లోని వ్యక్తి తన స్నేహితులతో మద్యం మత్తులో ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నాడు. దీనిని జీర్ణించుకోలేకపోయిన మరొక బ్యాచ్... వారితో వాదనకు దిగింది.

దీంతో రెండు బ్యాచ్ ల మధ్య వాగ్వాదం పెరిగింది. ఇది తోపులాటకు, తరువాత ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఒకబ్యాచ్ పై మరొక బ్యాచ్ మద్యం బాటిళ్లతో దాడి చేసుకుంది. దీంతో పలువురు అభిమానులు గాయాలపాలయ్యారు. వెంటనే బార్ సిబ్బంది, బార్ కు వచ్చినవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ పడ్డవారు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Copyright © 2017; www.ap7am.com