84 కేసులున్న నకిలీ ఎస్సై అరెస్టు!
ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంలో విజిలెన్స్‌ ఎస్సైనంటూ బెదిరింపులకు దిగి మోసానికి పాల్పడుతున్న 84 క్రిమినల్ కేసులున్న కరుడుగట్టిన నేరగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దాములూరుకు చెందిన ఐతం రవిశేఖర్‌ (48) 2007నుంచి ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, తెలంగాణాలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడ్డాడు. అంతే కాకుండా, మూడు కార్లు, 10 ద్విచక్రవాహనాలు, బంగారం, 57 లక్షల రూపాయల నగదు చోరీచేశాడు. దీంతో అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 34 పోలీస్‌ స్టేషన్లలో 84 కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఇతనిని గతనెల 19న తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచి జగ్గయ్యపేట జైలుకు తీసుకువస్తుండగా... విజయవాడలో ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో ఆ రోజున అతనికి ఎస్కార్టుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్‌ ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

పరారీలో ఉన్న రవిశేఖర్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఇంతలో ఈనెల 17న ఎర్రుపాలెం లారీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయానికి వచ్చిన రవిశేఖర్, తాను విజిలెన్స్‌ ఎస్సైనని... మీరు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ, కేసులు నమోదు చేయకుండా వదిలేయాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లారీ యజమాని మొగిలి అప్పారావు అందుకు అంగీకరించకపోవడంతో కనీసం 5000 ఇవ్వాలని అన్నాడు. దానికి కూడా అంగీకరించకపోవడంతో 'పోనీ 3000 ఇవ్వండి' అని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అప్పారావు... నేరుగా ఎస్సై ఆంజేయులుకు ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి రవిశేఖర్ ను అదుపులోకి తీసుకుని, మధిర కోర్టుకు తరలించారు.
Copyright © 2017; www.ap7am.com