ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... 'కళ్లు మూసుకో.. సర్ ప్రైజ్ ఇస్తా'నని చెప్పి ప్రాణం తీశాడు!
ప్రేమించానని వెంటపడ్డాడు... నువ్వు లేనిదే జీవితం లేదని అన్నాడు.. చివరికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లాడిన తరువాత మనస్పర్థలతో దూరమై... తిరిగి మారిపోయానని భార్యను నమ్మించాడు. చివరికి నమ్మిన భార్యను హతమార్చాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన మనోజ్ కుమార్ (24) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ కోమల్ (22) అనే యువతి వెంటపడేవాడు. మొత్తానికి ఆమెను నమ్మించి ప్రేమలో దించాడు. అనంతరం వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమెకు అసలు విషయం అర్ధమైంది. ప్రేమలో ఉండగా మనోజ్ చూపించినదంతా జస్ట్ ట్రైలర్ అని, పెళ్లి తరువాత సినిమా మొత్తం భయంకరంగా వుండనుందని ఆమెకు అర్థమైంది.

దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పర్యవసానంగా కొమల్ పుట్టింటికి చేరింది. ఎలాగోలా భార్యను దారికి తెచ్చుకోవాలని భావించిన మనోజ్ మంచిగా నటించడం మొదలు పెట్టాడు. మారిపోయానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. దీంతో ఢిల్లీలోని బోంటా పార్కుకు వెళ్దామని తీసుకెళ్లాడు. అక్కడ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. భర్త మారాడని, అతని మాటలు నిజమని నమ్మిన కోమల్ అతను చెప్పినట్టే కళ్లు మూసుకుంది. అయితే ఆమె కళ్లు తెరిచేలోపు ఆమె మెడకు వైర్ బిగించి ఆమెను హత్య చేశాడు. అనంతరం తన భార్యను పార్కులో హతమార్చానని, ఢిల్లీ దాటేందుకు సాయం చేయాలంటూ స్నేహితుడికి ఫోన్ చేశాడు. దీంతో ఆ స్నేహితుడు అతని వివరాలు పోలీసులకు అందించాడు. దీంతో వారు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Copyright © 2017; www.ap7am.com