అభిమానుల అత్యుత్సాహం... పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న వైనం!
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ ను పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడించడంతో అభిమానుల అత్యుత్సాహం నీరుగారింది. మ్యాచ్ కు ముందు సగటు భారత అభిమాని సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. క్రికెట్ ను ఆటగా కాకుండా యుద్ధంలా భావించాడు. దీంతో ఫాదర్స్ డే రోజున 'బాప్' (అబ్బ) ఎవరో తేలిపోతుందంటూ రెచ్చిపోయాడు. చరిత్ర, గణాంకాలు, లెక్కలు, సమీకరణాలు, బలాబలాలు... ఇలా ఏం చూసినా భారత్ దే విజయమని ఢంకా బజాయించాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసింది. భారత్ చిత్తుగా ఓడింది. దీంతో అప్పటి వరకు సగటు భారతీయ అభిమాని ప్రత్యర్థిని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ స్వదేశానికే రివర్స్ లో తగిలినట్టైంది. దీంతో ఆటను ఆటగా కాకుండా యుద్ధానికి నకలులా చూసిన సగటు భారత అభిమాని నీరుగారిపోయాడు. నిన్నటి వరకు తన అభిమాన ఆటగాళ్లను ఏ నోటితో అయితే పొగిడాడో... ఇప్పుడు అదే నోటితో వారిని తిడుతూ కూర్చున్నాడు. ఓటమిని జీర్ణించుకోలేక 'మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ' కొత్తపల్లవి అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ల ఇళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Copyright © 2017; www.ap7am.com