ఇది కొత్త యోగా... గ'మ్మత్తు'గా బీరు తాగుతూ యోగా!
భారతీయ ఆధ్యాత్మిక శైలి యోగా సరికొత్త రూపుసంతరించుకుంటోంది. భారతీయుల జీవన విధానంలోనే యోగా ఉందని పెద్దలు పేర్కొంటుంటారు. ఈ యోగాను విదేశీయులు బాగా ఆదరిస్తున్నారు. మోదీ ప్రధానిగా ఎన్నికైన అనంతరం యోగాకు మరోసారి స్వర్ణయుగం ఆరంభమైంది. ఈ క్రమంలో పతంజలి యోగాతో మొదలై పవర్‌ యోగా, విక్రమ్‌ యోగా, అయ్యంగార్‌ యోగా, గోట్‌ యోగా ఇలా ఎన్నో కొత్త రకాల యోగాలు పుట్టుకొచ్చాయి. వీటన్నింటికి తోడుగా తాజాగా బీర్‌ యోగా పుట్టుకొచ్చింది. ఇది పాశ్చాత్య దేశాల వరకు పరిమితమైతే బాగుండేది...భారత్ లో కూడా ఇది విస్తరించడం విశేషం.

లేటెస్ట్‌ ఫిట్‌ నెస్‌ ట్రెండ్‌ గా పిలిచే ఈ బీర్ యోగా జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, థాయ్‌ లాండ్‌ దేశాల్లో బాగా విస్తరిస్తోంది. జర్మనీకి చెందిన యోగా టీచర్లు ఎమిలీ, ఝులా దీని గురించి మాట్లాడుతూ, అత్యున్నత స్థాయి చేతనను చేరుకోవడానికి యోగా వేదాంతంతో బీర్‌ ఆహ్లాదాన్ని మిళితం చేశామని అన్నారు. ఈ బీర్ యోగాను బీర్‌–యోగా అనే ‘ఇద్దరు గొప్ప ప్రేమికుల పెళ్లి’ అని వారు అభివర్ణించారు. కొంచెం బీర్‌ తాగి ఆసనం వేయడం, ఆసనాలు వేసేటపుడు బీర్‌ బాటిల్‌ ను బ్యాలెన్స్‌ చేయడం ఉంటాయని బీర్ యోగా టీచర్‌ నషీ వెంకట్రామన్‌ తెలిపారు. 

బీర్‌ తాగుతూ సూర్య నమస్కారాలు చేయడం, తలపై బీర్‌ బాటిల్‌ ను బ్యాలెన్స్‌ చేస్తూ వృక్షాసనం, పద్మాసనం, నటరాజాసనం ఇలా ఆసనాలు ప్రాక్టీస్ చేయడం గమ్మత్తుగా ఉంటుందని వారు చెబుతున్నారు. దీనిపై భారతీయ నెటిజన్లు...బీర్ కి బదులుగా భంగు తాగాలని సూచిస్తున్నారు. కాగా, దురలవాట్ల నుంచి విముక్తికి యోగా కనిపెడితే....దురలవాట్లను పెంచే విధంగా యోగాను మార్చడంపై పలువురు సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. 
Mon, May 01, 2017, 07:54 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View