వీరభద్రుడు
వీరభద్రుడు ... ఈ పేరు వినగానే పురాణాలలో పేర్కొనబడిన దక్ష యజ్ఞ ధ్వంసం గుర్తుకు వస్తుంది ... దక్ష ప్రజాపతి సంహారం కళ్ళ ముందర కదలాడుతుంది. దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన 'బృహస్పతి సవనం' అనే యాగానికి అల్లుడైన శివుడికి మినహా అందరికీ ఆహ్వానం పంపుతాడు. ఈ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, మనసు గాయపడటంతో అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది.

జరిగింది గ్రహించిన శివుడు ... ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శివుడి కోపాగ్నిలో నుంచి దశ భుజాలతో ... మెడలో కపాలాలతో ... పర్వతాకారంలో 'వీరభద్రుడు' ఉద్భవించాడు. ఆదిదేవుడి అంశతో అవతరించిన 'వీరభద్రుడు' దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దక్షుడి తల తీసేస్తాడు. ఈ కారణంగా అవతరించిన 'వీరభద్రుడు' వివిధ క్షేత్రాలలో, యుద్ధ వీరభద్రుడిగా ... అగ్ని వీరభద్రుడిగా ... నృత్య వీరభద్రుడిగా పూజలు అందుకుంటున్నాడు.

ఈ స్వామిని కొలవడం వలన పాపాలు తొలగిపోతాయనీ, కార్యానుకూలత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివాంశతో అవతరించడం వలన సోమవారం రోజున దర్శించుకోవడం మంచిదని అంటారు. ఆయనకి ఎంతో ఇష్టమైన పులిహోర ... పొంగలి ... శనగలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆయనను శాంతింప జేయడానికంటూ నిమ్మకాయల దండలను సమర్పించే ఆచారం కూడా కనిపిస్తుంది.
Mon, Jul 08, 2013, 11:27 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View