శయనముద్రలో వెలసిన వేంకటేశ్వరుడు
సాధారణంగా వేంకటేశ్వరస్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. కొండలపై .. బండరాళ్లపై ఆయన స్థానక మూర్తిగానే దర్శనమిస్తుంటాడు. అలా కాకుండా వేంకటేశ్వరస్వామి శయనముద్రలో దర్శనమివ్వడం చాలా అరుదు. అలాంటి అరుదైన మూర్తి 'అమ్మపేట'లో కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా .. ముదిగొండ మండలం .. 'అమ్మపేట' గ్రామానికి సమీపంలో గల గుట్టపై స్వామి ఆవిర్భవించాడు.

ఇక్కడి గుట్టపై రెండు బండరాళ్ల మధ్యలో స్వామి శయన భంగిమలో దర్శనమిస్తాడు. అలసిపోయి సేదదీరుతున్నట్టుగా స్వామి కనిపిస్తాడు. అనంతపద్మనాభస్వామి మాదిరిగా వేంకటేశ్వరస్వామి వెల్లకిల పడుకుని ఉండటం ఇక్కడి విశేషం. అర్చక స్వాములు బండరాళ్ల మధ్యలో నుంచి దూరి వెళ్లి నిత్యపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ గుట్టభాగంలోనే ఒక వైపున పొడవైన బండరాయి 'విమానం' ఆకారంలో కనిపిస్తుంది. దీనిపైనే స్వామివారు విహరిస్తూ ఉంటారని భక్తులు విశ్వసిస్తుంటారు.
Thu, Jan 16, 2020, 06:37 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View