సంజీవరాయుడిగా పూజలందుకునే హనుమంతుడు
హనుమంతుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో 'వెల్లాల' ఒకటి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడు 'సంజీవ రాయుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడి 'కుందూ' నది దగ్గర ఆగాడట.

అక్కడ ఆయనని దర్శించుకున్న మహర్షులు కాసేపు వుండమనగా, 'వెళ్లాలి .. వెళ్లాలి' అంటూ హనుమంతుడు ఆతృతను కనబరిచాడట. అందువలన ఈ గ్రామానికి 'వెల్లాల' అనే పేరు వచ్చిందని గ్రామస్థులు చెబుతుంటారు. మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో 'హనుమంత మల్లు' అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి హనుమంతుడిని దర్శించుకోవడం వలన, వ్యాధులు .. బాధలు దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు, ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తుంటారు.
Fri, May 31, 2019, 05:15 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View