అందుకే ఇక్కడి శివుడికి ఆ పేరు
పరమశివుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో 'సోమవరం' ఒకటి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి శివలింగం భృగుమహర్షిచే పూజలందుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో భృగుమహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. ఒకసారి ఆయన ఇక్కడి ముచికుందా నదీ తీరంలో స్నానమాచరించి వెళుతుండగా, ఆయన చేతిలోని రుద్రాక్ష మాల జారిపడిపోయిందట.

అలా జారిపడిపోయిన రుద్రాక్ష నుంచి పరమశివుడు ప్రత్యక్షమై, శివలింగంగా మారిపోయినట్టు చెబుతారు. దాంతో ఆ శివలింగాన్ని భృగుమహర్షి అనునిత్యం పూజిస్తూ .. సేవిస్తూ వచ్చాడట. భృగుమహర్షి కారణంగా ఇక్కడ శివుడు ఆవిర్భవించడం వలన ఇక్కడి శివుడు భృగు మాలికా సోమేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. సోమేశ్వరుడు కొలువైన కారణంగానే ఆ స్వామి పేరుతో ఇక్కడ 'సోమవరం' గ్రామం ఏర్పడింది. కాకతీయుల కాలంలో ఇక్కడి స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం విశేషం. శివరాత్రి రోజున ఇక్కడి స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.   
Mon, Apr 08, 2019, 06:00 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View