శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యం వెనుక కథ
శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది .. దానికి 'పాంచజన్యం' అని పేరు. ఈ పాంచజన్యం వెనుక పురాణ సంబంధమైన ఒక ఆసక్తికరమైన కథ వుంది. బలరామ కృష్ణులు సాందీప మహర్షి ఆశ్రమంలో ఉంటూ సకల విద్యలు నేర్చుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ఏమి కావాలని అడుగుతారు. మరణించిన తన కుమారుడిని బ్రతికించి తెచ్చి ఇవ్వమని సాందీపుడు కోరతాడు. గురుపుత్రుడు సముద్ర స్నానానికి వెళ్లి మరణించాడని తెలుసుకుని బలరామ కృష్ణులు అక్కడికి వెళతారు.

సముద్రుడిని పిలిచి తమ గురుపుత్రుడిని అప్పగించమని కోరతాడు కృష్ణుడు. ఆ పిల్లవాడిని 'పంచజనుడు' అనే రాక్షసుడు మింగాడనీ, సముద్ర గర్భంలోనే అతను ఉన్నాడని సముద్రుడు చెబుతాడు. సముద్ర గర్భంలోకి ప్రవేశించిన కృష్ణుడు .. ఆ రాక్షసుడి పొట్ట చీల్చగా ఒక శంఖం బయటపడుతుంది. పంచజనుడి పొట్ట నుంచి వచ్చింది కనుకనే అది 'పాంచజన్యం' అయింది. కృష్ణుడు యమలోకానికి వెళ్లి ఆ శంఖాన్ని పూరించగా, ఆయన వచ్చిన పనియేమిటో యమధర్మరాజుకు తెలిసిపోతుంది. ఆయన సాందీపని కుమారుడిని బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుగారికి గురు దక్షిణగా సమర్పిస్తాడు కృష్ణుడు.      
Fri, Jan 25, 2019, 06:19 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View