విక్రమదేవుని కారణంగా వెలుగు చూసిన జగన్మోహినీ కేశవస్వామి
'ర్యాలి' అనే పేరు వినగానే 'జగన్మోహినీ కేశవస్వామి' రూపం కనుల ముందు కదలాడుతుంది. ఆ మూర్తి సౌందర్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎంతో ప్రాచీనమైన ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక స్థలపురాణంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. క్రీ.శ.11వ శతాబ్దంలో 'రత్నాపురం' అనే గ్రామం సమీపంలో గల అడవిలోకి విక్రమదేవుడు అనే విష్ణుభక్తుడు వేటకు వెళతాడు. వేటాడి అలసిపోయిన ఆయన ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు కలలో ఆయనకి ఒక దివ్య స్వరూపం కనిపిస్తుంది.

'కలపతో ఒక రథాన్ని తయారు చేయించి, ఆ రథాన్ని లాగుతూ వెళ్లు. ఆ రథచక్రానికి గల 'సీల' ఎక్కడైతే 'రాలి' పడుతుందో అక్కడ తవ్విచూడు. అక్కడి నుంచి ఒక స్వయంభూ దేవతామూర్తి వెలుగు చూస్తుంది. ఆ సాలగ్రామశిలకు ఆలయాన్ని నిర్మించి, నిత్యపూజలు జరిగేలా చూడు' అని ఆ దివ్య స్వరూపం చెబుతుంది. మెలకువ రాగానే విక్రమదేవుడు 'కల'లో ఆ దివ్యజ్యోతి చెప్పినట్టుగానే చేసి, జగన్మోహినీ కేశవస్వామి మూర్తిని వెలికి తీసి ప్రతిష్ఠిస్తాడు. రథచక్రానికి గల సీల 'రాలి' పడిన కారణంగానే ఈ క్షేత్రానికి 'ర్యాలి' అనే పేరు వచ్చిందని అంటారు. శివ కేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన 'ర్యాలి' .. సమస్త పాపాలను హరించి సకల శుభాలను కలిగిస్తోంది.       
Tue, Sep 04, 2018, 05:35 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View