రాఘవేంద్రస్వామి మహిమలు
వేంకటనాథుడు క్రీ.శ.1621 .. దుర్మతి నామ సంవత్సరంలో .. ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామిగా సన్యాసాశ్రమం స్వీకరించారు.ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటించారు. తన భక్తుడి కుమారుడు మామిడి రసం నింపిన గంగాళంలో పడి మరణించినప్పుడు, స్వామి మూల రాముడిని స్మరించి ఆ కుర్రవాడిని బతికిస్తారు. అలాగే ఎవరి సహాయ సహకారాలు అందని ప్రదేశంలో తన భక్తుడి భార్య ప్రసవ వేదన అనుభవిస్తూ వుంటే .. ఆమెకి సుఖప్రసవం కలిగేలా చేస్తారు. ఇక పశువుల కాపరి అయిన వెంకన్నను ఆయన ఆశీర్వదించి తన అనుగ్రహ హస్తంతో 'దివాను' అయ్యేలా చేస్తారు.

ఒక వ్యక్తి అహంభావాన్ని సమూలంగా నశింపజేయడం కోసం .. ఆ గ్రామంలో యజ్ఞయాగాదులు జరిగేలా చూడటం కోసం 'రోకలి' చిగురించేలా చేస్తారు. తన శక్తిని పరీక్షించాలనుకున్న నవాబుకు తగిన విధంగా సమాధానమిచ్చి, 'మంచాల' గ్రామాన్ని బహుమతిగా పొందుతారు. ఒక ప్రాంతంలోని ప్రజలంతా కరవు కాటకాలతో నానా బాధలు పడుతుంటారు. ఆ రాజు అభ్యర్థనమేరకు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన రాఘవేంద్రస్వామి, వర్ష ధారలు కురిపించి కరవు కాటకాల నుంచి ప్రజలను కాపాడతారు. ఇలా ఎన్నో మహిమలను చూపిన స్వామి, క్రీ. శ. 1671 శ్రావణ బహుళ విదియ .. శుక్రవారం రోజున బృందావన ప్రవేశం చేశారు.           
Tue, Aug 28, 2018, 06:01 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View