కొల్హాపురి మహాలక్ష్మీ దర్శనమే చాలు
దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళ్లిన సతీదేవి, తండ్రి అవమానించడంతో యోగాగ్నిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆమె పార్థివ శరీరాన్ని భుజాన వేసుకుని పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. సతీదేవి శరీరం కనిపిస్తున్నంత వరకూ సదాశివుడి ఆవేశం చల్లారదని గ్రహించిన శ్రీమహావిష్ణువు, తన సుదర్శన చక్రంతో సతీదేవి పార్థివ శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి మూడవ నేత్రం పడిన ప్రదేశమే 'కొల్హాపురి క్షేత్రం' .. ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి.

పరమ పవిత్రమైనదిగా .. అత్యంత శక్తిమంతమైనదిగా ఈ క్షేత్రానికి పేరు. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని పైకెత్తి రక్షిస్తాడనీ, అలాగే అమ్మవారు తన 'గద'తో ఈ క్షేత్రాన్ని పైకెత్తి రక్షిస్తూ ఉంటుందని అంటారు. ఒకప్పుడు ఈ క్షేత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయిందట. అప్పుడు అమ్మవారు తన కరములతో ఈ క్షేత్రాన్ని పైకెత్తిందనీ .. అందువల్లనే దీనికి 'కరవీర క్షేత్రం' అనే పేరు వచ్చిందని చెబుతారు. ఎంతోమంది రాజులు ఇక్కడి అమ్మవారిని దర్శించి .. పూజించారు. ముఖ్యంగా 'ఛత్రపతి' శివాజీ ఈ అమ్మవారిని తరచూ దర్శించేవారట. ఈ ఆలయ వైభవానికి ఆయన ఎంతో కృషి చేశాడని స్థలపురాణం చెబుతోంది. మంగళ .. శుక్రవారాల్లో అమ్మవారికి ఇచ్చే ప్రత్యేక హారతులను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం నశించి సిరిసంపదలు చేకూరతాయని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు.          
Fri, Aug 24, 2018, 05:30 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View