సదాశివ బ్రహ్మేంద్రస్వామి మహిమ
సదాశివ బ్రహ్మేంద్రస్వామి చెట్ల నీడనే నివాసంగా చేసుకుని .. నిరంతరం దైవధ్యానంలోనే గడుపుతుండేవాడు. అలాంటి ఆయన దగ్గరికి ఆ చుట్టుపక్కల పిల్లలు కొంతమంది వచ్చేవారు. వాళ్లంతా కూడా ఆయనను బాబా .. బాబా అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ అక్కడ ఆడుకుని వెళ్లేవారు. ఒకసారి వాళ్లంతా కూడా తమని 'మధురై' తీసుకెళ్లమని అడిగారు .. అక్కడ జరుగుతోన్న ఉత్సవాన్ని చూడాలని ఉందని చెప్పారు. తల్లిదండ్రులకి చెప్పేసి సాయంత్రం రమ్మనీ .. 'మధురై' తీసుకెళతానని ఆయన అన్నాడు. పిల్లలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, ఎంతో దూరమైన 'మధురై'కి ఎట్లా తీసుకెళతాడు? అంటూ .. పిల్లల మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ సాయంత్రం తన దగ్గరికి వచ్చిన పిల్లలతో కళ్లు మూసుకోమని చెప్పాడు సదాశివ బ్రహ్మేంద్రస్వామి. కళ్లు తెరిచేసరికి వాళ్లంతా 'మధురై'లో వున్నారు. అక్కడ ఉత్సవం చూసి .. కావలసిన బొమ్మలను పిల్లలు కొనుక్కున్నాక, తిరిగి కళ్లు మూసుకోమన్నాడు స్వామి. పిల్లలు కళ్లు తెరిచేసరికి తమ ఊళ్లో వున్నారు. తాము 'మధురై' వెళ్లి వచ్చామంటూ పిల్లలు అక్కడి విశేషాలు చెబుతూ .. తాము కొనుక్కున్న బొమ్మలు చూపించడంతో తల్లిదండ్రులంతా ఆశ్చర్యపోయారు. దాంతో సదాశివబ్రహ్మేంద్ర స్వామివారి మహిమ వెలుగులోకి వచ్చింది.  
Sat, Aug 18, 2018, 05:45 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View