అయోధ్యలో అడుగుపెడితే చాలు
'రామాయణం'లో అయోధ్య నగర వర్ణనను చదివిన వారికి వెంటనే అయోధ్యను చూడాలనిపిస్తుంది. రామచంద్రుడితో ముడిపడిన అక్కడి ప్రదేశాలను స్పర్శించాలనిపిస్తుంది. రామచంద్రుడి ఆటపాటలకు .. ఆయన బరువు బాధ్యతలకు .. ఆనందానికీ ఆవేదనకు సాక్ష్యంగా నిలిచిన అయోధ్యను దర్శించాలనిపిస్తుంది.

సప్త మోక్షదాయినీ నగరాల్లో అయోధ్య ఒకటిగా .. సూర్య వంశస్థుల రాజధానిగా కనిపిస్తుంది. శ్రీరాముడు అవతరించిన ధర్మభూమిగా ..  సీతారాములు నడయాడిన పుణ్యభూమిగా ఆ నగరం దర్శనమిస్తుంది. అయోధ్యలో అడుగుపెట్టగానే సీతారాములకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి. ఇక్కడ ఎన్నో అశ్వమేధ .. రాజసూయ యాగాలు జరిగాయి. అందువలన అయోధ్యలో అడుగుపెట్టినవాళ్లు అదృష్టవంతులు అంటారు. అయోధ్యను దర్శించడం వలన .. స్మరించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అయోధ్యలో చూడదగినవాటిలో 'కనకభవనం' ఒకటిగా కనిపిస్తుంది. సువిశాలంగా కనిపించే ఈ భవనంలోనే సీతమ్మవారు వుండేవారని అంటారు. ఇక హనుమాన్ గఢీ .. లక్ష్మణ్ ఘాట్ కూడా చూడదగినవి. స్వర్గద్వార్ ఘాట్ లో నాగేశ్వరనాథ మందిరం వుంది. సాక్షాత్తు ఈ మందిరాన్ని లవకుశుల్లో ఒకరైన 'కుశుడు' నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. 'రామాయణం' చదివినవారికి అయోధ్య అంతా కూడా రమణీయ దృశ్యమాలికగానే కనిపిస్తూ ఉంటుంది .. అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూనే ఉంటుంది.  
Thu, Aug 16, 2018, 06:01 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View