కుమారధార తీర్థం ప్రత్యేకత
తిరుమల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన్నే సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి తిరుమలలో అనేక పుణ్య తీర్థాలు వున్నాయి. ప్రతి పుణ్యతీర్థం ఏదో ఒక విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడ గల మహిమాన్వితమైన పుణ్య తీర్థాలలో 'కుమారధార తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించినందు వలన వృద్ధాప్యం అంత త్వరగా రాదని అంటారు. అందుకు సంబంధించిన ఒక కథ ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఒక వృద్ధుడు ఇక్కడి 'వృషభా చలం'పై తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. ఒకసారి తన శిష్యుడితో కలిసి ఆశ్రమం నుంచి బయటికి వచ్చిన ఆయన దారితప్పిపోతాడు. ఆ వృద్ధుడి పరిస్థితి తెలిసి వేంకటేశ్వరస్వామి మారు వేషంలో అక్కడికి వస్తాడు. అంత వృద్ధాప్యంలోను తన సేవ కోసం ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడటం చూసి, ఒక తీర్థం దగ్గరికి తీసుకెళ్లి అందులో స్నానం చేయమంటాడు. ఆ తీర్థంలో స్నానమాచరించిన ఆ వృద్ధుడు .. యవ్వనవంతుడవుతాడు. స్వామివారికి మనసులోనే నమస్కరించి తన ఆశ్రమానికి చేరుకుంటాడు. ఈ కారణంగానే ఈ తీర్థానికి 'కుమారధార తీర్థం' అనే పేరు వచ్చిందని అంటారు.    
Wed, Jun 13, 2018, 05:44 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View