అలా ఈ పోచమ్మతల్లి ఇక్కడికి వచ్చిందట
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతగా పోచమ్మ తల్లి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తల్లే తమ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుందని గ్రామీణ ప్రజలు విశ్వసిస్తూ వుంటారు .. భక్తిశ్రద్ధలతో కొలుస్తూ వుంటారు. అలాంటి పోచమ్మ తల్లి ఆలయాలలో అత్యంత విశిష్టమైనదిగా 'అడెల్లి' పోచమ్మ తల్లి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పరిథిలో 'అడెల్లి' గ్రామం దర్శనమిస్తూ ఉంటుంది.

పూర్వం ఈ ప్రాంతంలో కరవు ఏర్పడినప్పుడు .. గ్రామస్తులంతా తమని కాపాడమంటూ అమ్మవారిని వేడుకున్నారట. ఆ తల్లి తన చెల్లెళ్లతో కలిసి ఇక్కడికి వచ్చి వానలు కురిపించి .. కరవు బారి నుంచి ఇక్కడి ప్రజలను కాపాడిందట. ఆ తరువాత భక్తుల కోరికమేరకు తన చెల్లెళ్లతో కలిసి ఈ ప్రదేశంలో కొలువైందని చెబుతారు. అమ్మవారి చెల్లెళ్లుగా గర్భాలయంలో  బ్రాహ్మణి .. మహేశ్వరి .. కౌమారి .. వైష్ణవి .. వారాహి .. ఇంద్రాణి .. చాముండి అమ్మవార్లు కొలువై వుంటారు . పరశురాముడు ఈ ప్రదేశంలో సంచరించాడనీ, అమ్మవారికి గద్దెని ఏర్పాటు చేసింది ఆయనేనని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన ఆపదలు తొలగిపోతాయనీ .. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని అంటారు. ఈ తల్లిని దర్శించుకోవడానికి ప్రతి ఆదివారం విశేషమైన సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు .. అమ్మవారిని దర్శించుకుని చల్లగా చూడమని కోరుతుంటారు.           
Fri, Apr 13, 2018, 05:09 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View