ఆపదలను తొలగించే భక్తాంజనేయుడు
మధురమైన రామనామం వింటేనే మైమరిచిపోయే హనుమంతుడు .. రామభక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. తనని ఆరాధించేవారిని అనుగ్రహించడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు. అలాంటి ఆ స్వామి భక్తాంజనేయుడుగా .. వీరాంజనేయుడుగా.. దాసాంజనేయుడుగా .. యోగాంజనేయుడిగా వివిధ నామాలతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలా ఆ స్వామి  ' భక్తాంజ నేయుడు'గా కొలువైన ఆలయం మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా .. ఎల్లారెడ్డిపేట మండలం పరిథిలోని 'రాచర్ల గొల్లపల్లి'లో దర్శనమిస్తుంది.

కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే .. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతకు .. పవిత్రతకు ప్రతీకగా కనువిందుచేస్తూ ఉంటుంది. హనుమంతుడి మూలమూర్తి 17 సంవత్సరాల క్రితం ఓ అడవిలో ఒక భక్తుడికి దొరకగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అందువలన ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడని అంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన .. ఆకు పూజలు జరిపించడం వలన ఆపదలు .. గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారికి ప్రీతికరమైన 'వడమాల'లను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ వుంటారు.

ఇక ఇదే ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఒక వైపున శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు .. మరో వైపున సీతారామలక్ష్మణుల ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడి ఉపాలయంలో శివుడు కొలువై ఉండగా .. ఆ పక్కనే నవగ్రహ మంటపం దర్శనమిస్తూ ఉంటుంది. హనుమజ్జయంతి .. శ్రీరామనవమి ..  ముక్కోటి ఏకాదశి .. శివరాత్రికి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది .. భగవంతుడు తోడుగా ఉన్నాడనే భరోసా కలుగుతుంది.            
Wed, Feb 28, 2018, 06:56 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View