పూజా మందిరం పవిత్రంగా ఉండాలి
ఉదయాన్నే పూజ చేసుకుని తమ దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టే వాళ్లు చాలామంది వుంటారు. ఎవరి ఇష్ట దేవతను వాళ్లు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇల్లు విశాలంగా ఉండటాన్ని బట్టి కొంతమంది పూజకి ఒక గదిని కేటాయిస్తే, మరికొంతమంది పూజా మందిరంతో సర్దుకుంటారు. పూజా మందిరంలో దేవతల చిత్రపటాలను మాత్రమే ఉంచేవాళ్లు కొందరైతే .. దేవతా మూర్తుల ప్రతిమలను కూడా వుంచి పూజాభిషేకాలు నిర్వహించే వాళ్లు మరికొందరు. పూజించే దైవం ఏదైనా .. పూజ మందిరం .. పరిసరాలు చాలా పవిత్రంగా .. పరిశుభ్రంగా ఉండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 పూజా మందిరం .. దేవతా మూర్తులు .. దీపారాధన కుందులతో సహా, అభిషేకానికి .. పూజకి .. నైవేద్యాలకి ఉపయోగించే వస్తువులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పూజా మందిరంలో నిత్యం దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఉదయమైనా .. సాయంత్రమైనా దీపారాధన కొండెక్కాకా .. అక్కడ లైటు వెలిగేలా చూసుకోవాలి. పూజా మందిరం చీకట్లో వుండకుండా చూడాలి. పూజా మందిరం పవిత్రంగా .. పరిశుభ్రంగా .. కళకళలాడుతూ ఉండటం వలన, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.  
Copyright © 2017; www.ap7am.com