విశ్వాసమే లక్ష్యానికి చేరుస్తుంది!
ఎవరైనా ఏ పనినైనా బలమైన విశ్వాసంతో చేస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం జరుగుతుందనేది పెద్దలు చెప్పిన మాట. విశ్వాసమే విజయాన్ని ప్రసాదిస్తుందనే నిజం ఎంతో మంది విషయంలో నిరూపించబడింది. రామ నామం పట్ల హనుమంతుడికి అపారమైన విశ్వాసం వుంది. ఆ విశ్వాసమే తనని సముద్రాన్ని దాటిస్తుందని ఆయన బలంగా నమ్మాడు. అనుకున్నట్టుగా ఆ విశ్వాసమే ఆయనని సముద్రాన్ని దాటించింది.

 తపస్సుచే శ్రీ మహా విష్ణువును మెప్పించడం వలన, తండ్రి ప్రేమను పొందవచ్చనే తల్లి మాట పట్ల ధ్రువుడు ఎంతో విశ్వాసాన్ని ఉంచుతాడు. బలమైన ఆ విశ్వాసమే సాక్షాత్తు ఆయనకి శ్రీ మహా విష్ణువు దర్శనం లభించేలా చేస్తుంది. శ్రీ మన్నారాయణుడు అంతటా ఆవరించి వున్నాడు .. ఆయన లేని ప్రదేశమంటూ లేదనే విశ్వాసాన్ని ప్రహ్లాదుడు ప్రకటించాడు. అపారమైన ఆయన విశ్వాసాన్ని నిలబెట్టడం కోసమే నారాయణుడు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. ఇలా విశ్వాసమే విజయాన్ని ప్రసాదిస్తుందనే అనేక సంఘటనలు ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంటాయి.           
Copyright © 2017; www.ap7am.com