శ్రీ కనకధారా స్తోత్ర పఠన ఫలితం
ఆర్ధిక పరమైన ఇబ్బందులు కుటుంబాలను అతలాకుతలం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా పేదరికంతో బాధపడేవారు 'శ్రీ కనకధారా స్తోత్రం' పఠించడం వలన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఒకసారి శ్రీ ఆదిశంకరులవారు ఒక ఇంటికి భిక్షకి వెళ్లారు. వచ్చింది ఆదిశంకరులవారు .. కానీ ఆయనకి భిక్ష వేసేందుకు ఆ ఇంట్లో ఏమీ లేదు. ఎంతో పేదరికంతో బాధపడుతోన్న ఆ వృద్ధురాలు .. ఏమీ లేదు అని చెప్పడం ఇష్టం లేక .. ఒక ఉసిరికాయను ఆయనకి సమర్పించింది. దాంతో ఆమె పరిస్థితి శంకరులవారికి అర్థమవుతుంది. అప్పుడాయన ఆమె పేదరికాన్ని తొలగించమంటూ లక్ష్మీదేవిని స్తుతించారు. దాంతో ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిశాయి. ఆదిశంకరులవారు పఠించిన ఆ స్తోత్రమే 'శ్రీ  కనకధారా స్తోత్రం' గా ప్రసిద్ధి చెందింది. అలాంటి 'కనకధారా స్తోత్రం' అనునిత్యం పఠించడం వలన, ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.       
Copyright © 2017; www.ap7am.com