భగవంతుడి అనుగ్రహంతోనే కార్యసిద్ధి
జీవితం ఆనందమయంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం కష్టమైనా కొన్ని కార్యాలను సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార పరమైన .. ఉద్యోగ పరమైన .. శుభకార్యాలకు సంబంధించిన కార్యాలను మొదలెడుతుంటారు. ఆ కార్యాలు సఫలీకృతం కావాలని ఎంతగానో ఆశపడుతుంటారు. అయితే తలపెట్టిన ఏ కార్యమైనా నెరవేరాలంటే, శక్తి సామర్థ్యాలు వుంటే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. ఆ శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా వుండాలని కొంతమంది మాత్రమే గ్రహిస్తుంటారు.

 ఏ కార్యాన్ని ఆరంభిస్తున్నా .. అనుగ్రహించమని ముందుగా భగవంతుడిని కోరుకోవాలనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాల్లోని కొన్ని ఘట్టాలు చెబుతున్నాయి. మహాబలవంతుడైన హనుమంతుడు కూడా, సీతమ్మవారి అన్వేషణ సమయంలో సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటగలనని అనుకోలేదు. సముద్రాన్ని లంఘించడానికి ముందుగా ఆయన ఇంద్రాది దేవతలను పూజించి, కార్యసిద్ధి కలిగేలా అనుగ్రహించమని ప్రార్ధించి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు తనకి అప్పగించిన కార్యాన్ని సాధించగలిగాడు.         
Copyright © 2017; www.ap7am.com