నాగపంచమిన నువ్వుల నూనెతో దీపారాధన
శ్రావణ శుద్ధ పంచమిని 'నాగపంచమి'అని అంటారు. ఈ రోజున చేసే నాగపూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నాగుల చవితి మరుసటి రోజున వచ్చే నాగపంచమి రోజున వెండితోగానీ .. మట్టితో గాని నాగ ప్రతిమను తయారుచేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయవలసి ఉంటుంది.

నాగేంద్రస్వామి సన్నిధిలో మట్టి ప్రమిదలు వుంచి .. 'నువ్వుల నూనె' తో ఏడు ఒత్తులను వెలిగించవలసి ఉంటుంది. ఈ రోజున దీపారాధనకి నువ్వుల నూనె ఉపయోగించడం అత్యంత శ్రేష్ఠమైనదని చెప్పబడుతోంది. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నాగ సంబంధమైన స్తోత్రాలు చదువుతూ సుగంధభరితమైన పూలను సమర్పించాలి. ఆ స్వామికి ఇష్టంగా చెప్పబడుతోన్న చలిమిడి .. వడపప్పు .. అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి.

పుట్టలో పాలుపోసి .. నాగేంద్రస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టాలి .. లేదంటే నూనె తగలని పదార్థాలను మాత్రమే స్వీకరించాలనే నియమం కనిపిస్తుంది. ఈ విధంగా నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. వివాహ యోగం .. సంతాన భాగ్యం .. సౌభాగ్య సిద్ధి కలుగుతాయి .. అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు లభిస్తాయి.
Tue, Aug 18, 2015, 08:10 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View