శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం
శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేయాలనీ .. పగలు నిద్రించకూడదని శాస్త్రం చెబుతోంది. శ్రావణ మాసంలో పూజలు .. నోములు జరుపుకునేవారు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించవలసి ఉంటుంది. శ్రావణమాసం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది. అందువలన ఈ మాసం లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనది.

చాంద్రమానం ప్రకారం శ్రావణం అయిదవ మాసంగా వస్తుంది. ఈ మాసంలో చంద్రుడు .. శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కనుక, శ్రావణమాసమనే పేరు వచ్చింది. సాధారణంగా లక్ష్మీనారాయణులను .. పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ వస్తున్నప్పటికీ, ఈ మాసంలో వారి ఆరాధన వలన లభించే ఫలితం మరెన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఇక ఈ మాసంలో ఏ దైవానికి ఇష్టమైన రోజున ఆ దైవాన్ని ఆరాధించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సోమవారం రోజున శివుడికి పూజాభిషేకాలు .. నిర్వహించడం, మంగళవారం రోజున పార్వతీదేవిని మంగళ గౌరిగా ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు .. సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని .. శనివారం రోజున శ్రీమహా విష్ణువును సేవించడం వలన సకల సంపదలు .. శుభాలు కలుగుతాయి. అందువలన శ్రావణ మాసంలో నియమనిష్టలను పాటిస్తూ లక్ష్మీనారాయణులను .. పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. వారి కృపాకటాక్షాలతో జీవితాన్ని పుణ్యప్రదం చేసుకోవాలి.
Wed, Aug 12, 2015, 08:07 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View