కన్ను అదిరితే ఫలితం కనిపిస్తుందా ?
అప్పుడప్పుడు కన్ను అదరడం జరుగుతూ వుంటుంది. ఒక్కోసారి కుడికన్ను ... ఒక్కోసారి ఎడమ కన్ను అదురుతూ వుంటుంది. సాధారణంగా కన్ను అదరడం గురించి చాలామంది పట్టించుకోరు. కన్ను అదరడం కూడా ఒక శకున సంకేతమేనని తెలిసినవారు మాత్రం దాని గురించి ఆలోచిస్తారు.

పురుషులకు ఎడమకన్ను ... స్త్రీలకు కుడికన్ను అదరడం మంచిదికాదనే విశ్వాసం పురాణకాలం నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కుడికన్ను అదరగానే ఏదో కీడు జరగనుందని స్త్రీలు ఆందోళన చెందుతూ వుంటారు. రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మవారికి కూడా కుడికన్ను అదిరినట్టు కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అరణ్యప్రాంతంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుంటారు. ఆహ్లాదాన్ని కలిగించే ఒక ప్రదేశంలో కొంతకాలం వుండదలచి పర్ణశాలను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడవారికి ఆనందంగా రోజులు గడిచిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే రావణుడి సోదరి అయిన 'శూర్పణఖ' ముక్కుచెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఆ సంఘటన అక్కడితో ముగిసిందని వాళ్లు అనుకుంటారు.

కానీ తన సోదరికి జరిగిన అవమానానికి రావణుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకు గాను శ్రీరాముడి భార్య అయిన సీతను అపహరించాలని అనుకుంటాడు. ఆ సమయంలోనే ఇక్కడ సీతమ్మకి కుడికన్ను అదిరిందట. దాంతో ఏదో కీడు జరగనుందని సీతమ్మ ఆందోళనని వ్యక్తం చేసినట్టుగా చెప్పబడుతోంది. ఇలా కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందనే విశ్వాసం ఆ కాలం నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది.
Thu, Mar 19, 2015, 07:47 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View