నరసింహుడి క్షేత్రంలో ఇదో ఆచారం !
ఆలయానికి వెళుతూ స్వామివారికి ... అమ్మవారికి పూలు - పండ్లు తీసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రత్యేకమైన ఉత్సవాలు ... జాతరల సమయంలో కానుకలు ... మొక్కుబడులు చెల్లించుకోవడం చేస్తుంటారు. అలా ఒక క్షేత్రంలో అమ్మవారి సమేతంగా ఆవిర్భవించిన స్వామికి ప్రతియేటా 'మకర సంక్రాంతి' రోజున పసుపు కుంకుమలు ... నూతన వస్త్రాలు ... ఆహారధాన్యాలు భక్తులు సమర్పిస్తుంటారు.

తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం మనకి 'హేమాచల లక్ష్మీనరసింహస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. వరంగల్ జిల్లా 'మల్లూరు' సమీపంలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందిది. ఇక్కడి గిరిజనులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు.

హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కొండకోనల్లో తిరుగాడుతూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. లక్ష్మీదేవి అంశతో జన్మించిన 'చెంచులక్ష్మి' ని ఇక్కడ మకర సంక్రాంతి రోజున వివాహామాడాడని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ రోజున ఇక్కడ గిరిజనులంతా కలిసి వరపూజా మహోత్సవాన్ని జరిపిస్తారు.

ఈ ఉత్సవంలో స్వామివారి పట్ల ... అమ్మవారి పట్ల ఇక్కడివారికి భక్తిశ్రద్ధలే కాదు అంతకుమించిన ప్రేమానురాగాలు కనిపిస్తుంటాయి. తమని కరుణిస్తున్నదీ ... కాపాడుతున్నది ఆ లక్ష్మీనరసింహుడేననే అపారమైన విశ్వాసం వారి మాటల్లో వినిపిస్తూ ఉంటుంది.
Mon, Dec 08, 2014, 08:01 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View