అదే ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత !
సాధారణంగా అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని సమర్పిస్తుంటారు. ఇక గ్రామదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడుతుంటారు. ఇందుకు భిన్నంగా ఒక క్షేత్రంలో అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతో తయారుచేయబడిన పులుసుని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ఏడాదికి ఒకసారి ... అదీ 'పోలాల అమావాస్య' రోజున గ్రామస్తులంతా కలిసి వచ్చి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని పెద్దమొత్తంలో సమర్పిస్తూ ఉండటం విశేషం. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం మనకి 'పెదవాల్తేరు'లో కనిపిస్తుంది. విశాఖ పరిధిలో గల ఈ క్షేత్రంలో ఈ అమ్మవారిని దుర్గాదేవి స్వరూపంగా భావిస్తుంటారు ... 'పోలమాంబ' పేరుతో పూజిస్తుంటారు.

క్రీ.శ.14వ శతాబ్దం నుంచి ఇక్కడి అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటోంది. సముద్రంలో చేపల వేటకి వెళ్లిన జాలరులకి దొరకడం వలన అమ్మవారు స్వయంభువు మూర్తిగా చెప్పబడుతోంది. అనునిత్యం అమ్మవారిని సేవించే భక్తులు ప్రతి పోలాల అమావాస్య రోజున ఆ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల కాయగూరలతో చేయబడిన పులుసుని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

అమ్మవారి అనుగ్రహం కారణంగానే తమ ప్రాంతంలో సకాలానికి వర్షాలు కురుస్తున్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆమె చల్లని దయ కారణంగానే పంటలు బాగా పండుతున్నాయని అంటారు. అందుకు కృతజ్ఞతగా ఆ తల్లికి తాము పండించిన కాయగూరలతో పులుసు తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తుంటామని అంటారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని చెబుతుంటారు.
Thu, Nov 27, 2014, 08:09 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View