శ్రీ విశాలాక్షీ దేవి
విశ్వేశ్వరుడి నివాస స్థానమైన కాశీ క్షేత్రంలో 'విశాలాక్షీ శక్తి పీఠం' ఆవిర్భవించింది. సతీదేవి 'మణికర్ణిక' ఈ ప్రదేశంలో పడిందని చెబుతుంటారు. సప్త మోక్షపురాల్లో ఒకటిగా ... ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక ఇక్కడి అమ్మవారికి విశాలాక్షి అనే పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథ వినిపిస్తోంది.

భూలోకంలో అధర్మం పెరిగిపోతుండటంతో, పరిపాలన చేపట్టి ధర్మాన్ని కాపాడమని 'దివో దాసు'అనే క్షత్రియుడిని కోరాడు బ్రహ్మదేవుడు. అయితే దేవతలంతా భూలోకం విడిచి వెళితేనేగాని తాను పరిపాలనా బాధ్యతలను స్వీకరించనని దివోదాసు తేల్చిచెప్పాడు. ఆ సమయంలోనే శివుడు కూడా కాశీ నగరాన్ని వదలి కైలాసానికి వెళ్లిపోయాడు.

కాలం గడుస్తున్నా కొద్దీ కాశీ నగర వియోగాన్ని పరమ శివుడు తట్టుకోలేకపోయాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తుండటం వల్ల, అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోయాడు. ఇది గమనించిన వినాయకుడు దివోదాసుకి వైరాగ్యాన్ని కలిగించి, అతనే శివుడిని ఆహ్వానించేలా చేశాడు.

దివోదాసు ఆహ్వానం అందుకున్న శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీ క్షేత్రంలో కాలుపెట్టాడు. పట్టరాని ఆనందంతో వస్తోన్న శంకరుడిని పార్వతీదేవి తన కళ్లను విశాలం చేసుకుని చూస్తూ మురిసిపోయిందట. ఈ కారణంగానే అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తూ వుంటారు.
Tue, Jun 18, 2013, 07:27 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View