అపర ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ?
పాపపుణ్యాలపై ఆధారపడే జీవితం కొనసాగుతూ వుంటుంది. చేసిన పుణ్యాలను బట్టి ఆనందాలు ... తెలిసో తెలియకో చేసిన పాపాలను బట్టి దుఃఖాలు కలుగుతుంటాయి. ఆనందాలను పంచుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తుంటారు గానీ, కష్టాల్లో వున్నప్పుడు కంటికి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతుంటారు.

అందుకే కష్టాలకు కారణమయ్యే పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుంటారు ... పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తుంటారు. మరికొందరు దానధర్మాలు చేస్తూ పుణ్యరాశిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇక ఆర్ధిక పరిస్థితులు కారణంగా ... అనారోగ్య సమస్యల వలన పుణ్యక్షేత్రాలను దర్శించలేనివాళ్లు ఎంతోమంది వుంటారు. అలాంటి వాళ్లందరూ తాము చేసిన పాపాల నుంచి విముక్తిని పొందడానికి భగవంతుడు ప్రసాదించిన వరమే 'అపర ఏకాదశి' గా చెప్పబడుతోంది. 'జ్యేష్ఠ బహుళ ఏకాదశి' రోజునే అపర ఏకాదశి గా ... సిద్ధ ఏకాదశిగా పిలుస్తూ వుంటారు. ఉపవాస జాగారణాలతో ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించి, శ్రీమహావిష్ణువు ధరించిన వామన అవతారాన్ని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, ఏడాది పొడవునా గోదావరి నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. సూర్యగ్రహణ సమయంలో 'కురుక్షేత్రం' లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం ... దివ్య తీర్థాలను సేవించిన ఫలితం సొంతమవుతుంది. గోదానం ... భూదానం ... సువర్ణ దానం వంటి విశిష్టమైన దానాలను చేసిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.
Thu, Jun 19, 2014, 02:53 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View