నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి ?
సమస్త పాపాల నుంచి సకల దోషాల నుంచి బయటపడటానికి భగవంతుడు చూపిన మార్గం 'ఏకాదశి వ్రతం'. ఈ వ్రతాన్ని ఆచరించి దాని యొక్క మహాత్మ్యం గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసిందే. అనుకోని పరిస్థితుల వలన ... అనూహ్యమైన ఆటంకాల వలన ఏకాదశి వ్రతాలను చేయలేని వాళ్లు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ వ్రతం ద్వారా భగవంతుడి అనుగ్రహాన్ని పొందలేకపోయిన వాళ్లు బాధపడుతుంటారు.

అలాంటి వారికి ఆ శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన అరుదైన వరమే 'నిర్జల ఏకాదశి'. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి 'నిర్జల ఏకాదశి' గా చెప్పబడుతోంది. ఈ రోజున 'త్రివిక్రమమూర్తి'ని ఆరాధించమని శాస్త్రం చెబుతోంది కనుక, దీనిని 'త్రివిక్రమ ఏకాదశి' గా కూడా పిలుస్తూ వుంటారు. ఈ నిర్జల ఏకాదశి రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవలసి వుంటుంది. ఆచమనం సమయంలో తప్ప నీళ్లు ఉపయోగించకూడదు. ఈ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ శ్రీమహావిష్ణువును పూజించాలని సాక్షాత్తు పార్వతీదేవికి పరమ శివుడు వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఇదే విషయాన్ని ద్వాపర యుగంలో భీముడితో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో ... నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని పూర్తి చేయవలసి వుంటుంది. ఆ తరువాత బెల్లం ... వడపప్పు ... నెయ్యి వంటి పదార్థాలతో పాటు గొడుగును బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఎడాదిలోని మిగతా ఏకాదశి వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది
Sat, Jun 07, 2014, 10:03 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View