దశపాపహర దశమి రోజున ఏం చేయాలి ?
నిత్య జీవితంలో తెలిసీ తెలియక చేసిన కొన్ని పాపాలు, భవిష్యత్తులో తగిన ఫలితాలను ఇవ్వడం కోసం ఖాతాలో చేరిపోతుంటాయి. పాపల భారాన్ని మోయడం ... వాటి ఫలితాలను అనుభవించడం సామాన్యమైన విషయం కాదు. కొత్తగా పుణ్యకార్యాలను ప్రారంభించినంత మాత్రాన, అంతకు పూర్వం చేసిన పాపాలు చెరిగిపోవు ... తరిగిపోవు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా ? తప్పని సరిగా వాటి ఫలితాలను అనుభవించవలసిందేనా ? అనే సందేహంతో పాటు ఆవేదన కూడా కలుగుతుంటుంది. అలాంటి వారికి దైవం ప్రసాదించిన వరంగా 'దశపాపహర దశమి' కనిపిస్తుంది. 'జ్యేష్ఠ శుద్ధ దశమి' రోజునే, 'దశాపాపహర దశమి'గా చెబుతుంటారు. భూమిపై జలదేవతగా గంగావతరణ జరిగింది ఈ రోజునే.

ఈ శుభదినాన గంగానదిలో స్నానమాచరించి గంగాదేవిని పూజించడం వలన, పదిరకాల పాపాలను హరిస్తుందని అంటారు. ఈ కారణంగానే దీనికి దశపాపహర దశమి అనే పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని 'గంగోత్పత్తి' అనీ ... 'గంగోత్సవం' అని పిలుస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే గంగానదిలో స్నానం చేయాలి. లేదంటే చెరువు నీటిని ... బావి నీటిని గంగ నీరుగా భావన చేసుకుని స్నానం చేయాలి.

ఈ సమయంలో ''మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే'' అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత గంగాదేవి ప్రతిమను గానీ ... చిత్రపటాన్ని గాని అలంకరించి షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ పూజలో పది రకాల పూలను ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే పది రకాల ఫలాలను ... పది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవలసి వుంటుంది.

గంగాదేవికి పేలాల పిండితో చేసిన వంటకాలు చాలా ఇష్టమని అంటారు. అందువలన ఈ రోజున పేలాలతో చేసిన పదార్థాలను ప్రవాహంలో వదులుతుంటారు. ఈ విధంగా గంగాదేవిని ఆమె అవతరణ సందర్భంగా పూజించడం వలన, పదిరకాల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Thu, Jun 05, 2014, 09:38 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View