జలపాలేశ్వర స్వామి

పరమశివుడు తన భక్తులను నీడలా అనుసరిస్తూ ఉంటాడు. వారి అవసరాలను గుర్తించి వాటిని తీరుస్తూ ... వారికి ఆపదలు ఎదురైనప్పుడు రక్షిస్తూ ఉంటాడు. తన భక్తుల కోసం అనేక ప్రాంతాలను పుణ్య క్షేత్రాలుగా చేసి, అడుగడుగునా ... అణువణువునా తాను ఉన్నాననే విశ్వాసాన్ని భక్తుల హృదయాల్లో నిలుపుతుంటాడు. అలాంటి అనుభవానికి నిలువెత్తు నిర్వచనంలా కనిపిస్తుంది 'జలపాలేశ్వర క్షేత్రం'.
భక్త జనకోటిచే విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం గుంటూరు సమీపంలోని 'వేములూరిపాడు'లో దర్శనమిస్తుంది. ప్రాచీనకాలం నాటి ఈ క్షేత్రం చారిత్రక వైభవాన్ని ... ఆధ్యాత్మిక శోభను కళ్ల ముందుంచుతుంది. కైలాసనాథుదు ఇక్కడ జలపాలేశ్వర స్వామిగా కొలువుదీరడానికి గల కారణాన్ని పరిశీలిస్తే, పూర్వం శివభక్తి పరుడైన చోళ రాజు ... అతని ముఖ్య అనుచర గణంతో కలిసి తన రాజ్యంలోని ప్రజల జీవనవిధానం గురించి తెలుసుకోవడానికి బయలుదేరాడు.
అలా వాళ్లు 'వేములూరి పాడు' ప్రాంతానికి వచ్చే సరికి చీకటి పడింది. అదంతా అరణ్య ప్రాంతం కావడంతో ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమతో తెచ్చుకున్న మంచినీళ్లు అయిపోవడంతో, రాజుగారితో సహా అందరికి దాహం కాసాగింది. ఆ చుట్టుపక్కల జలాశయాలు కూడా ఏమీ లేకపోవడంతో ప్రాణాలమీదకి వచ్చింది. దాంతో ఆ రాజు శివుడిని ప్రార్ధించగా ఆయన అక్కడ ప్రత్యక్షమై తన శిరస్సున గల గంగతో వారి దాహాన్ని తీర్చాడు.
అందుకు కృతజ్ఞతగా ఆ రాజు ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి అందులో 'జలపాలేశ్వర స్వామి' పేరుతో శివలింగాన్ని ... అమ్మవారి విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించాడు. కాలక్రమంలో ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందింది. ప్రతి యేటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి.