చక్కని సంతానం కోసం ఏం చేయాలి ?

కొత్త దంపతులు అందమైన తమ జీవితాన్ని గురించి ఎన్నో కలలు కంటారు. తమ అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని నిర్మించుకోవాలని అనుకుంటారు. తమకి పుట్టబోయే సంతానం గురించి కూడా వాళ్లకి కొన్ని అభిప్రాయాలు వుంటాయి. ఈ నేపథ్యంలో సంతానం కలగడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా వాళ్లు ఆందోళన చెందుతారు. ఏదో అపరాధం చేసినట్టుగా నలుగురిలోకి రావడానికి వెనకడుగు వేస్తుంటారు.
వాళ్ల పరిస్థితి పెద్దవాళ్లకు కూడా బాధ కలిగిస్తూ వుంటుంది. తమ పిల్లలకు సంతానాన్ని అనుగ్రహిస్తే చాలు ... ఇక జీవితంలో ఏమీ కోరమని వాళ్లు ఇష్టదైవానికి మొక్కుకుంటూ వుంటారు. కొత్త దంపతులను వెంటబెట్టుకుని వివిధ పుణ్యక్షేత్రాలకు తిరుగుతుంటారు. కొత్త దంపతులు తమకి సంతాన యోగాన్ని ప్రసాదించమని ఆయా దైవాలను కోరుతుంటారు.
ముందుగా ఆడపిల్ల పుడితే మంచిదా ? మగపిల్లాడు పుడితే మంచిదా ? అనే విషయాన్ని గురించి చర్చించుకుంటారే గాని, వాళ్లు గుణవంతులుగా ... ప్రతిభావంతులుగా ఉండాలని కోరుకోవడం మాత్రం కనిపించదు. హడావిడి తరువాత ఈ విషయం గుర్తుకు వచ్చి, తమకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే సంతానం కలగాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు.
అలాంటి వాళ్లు 'ఆవు నెయ్యి' తో సదాశివుడిని అభిషేకించాలని పురాణాలు చెబుతున్నాయి. వీలైతే దంపతులు పూజామందిరంలో గల శివలింగానికి అనుదినం ఆవు నెయ్యితో అభిషేకం చేయవచ్చు. లేదంటే దగ్గరలో గల శివాలయానికి ప్రతి సోమవారం వెళ్లి స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించవచ్చు.
ఈ విధంగా శివుడికి ఆవు నెయ్యితో అభిషేకాలు చేయించడం వలన అందమైన ... ఆరోగ్యవంతమైన ... ఉత్తములైన ... గుణవంతులైన ... ప్రతిభావంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది. అందువలన చక్కని సంతానాన్ని ఆశించే దంపతులు చల్లని మనసున్న శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వామి అనుగ్రహంతో ఆశించిన ఆనందానుభూతులను అందుకోవాలి.