కీర్తిప్రతిష్ఠల కోసం ఏ రోజున ఉపవాసం చేయాలి?

ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండటమని అర్థం. భగవంతుడి నామస్మరణం చేస్తూనో .. ఆయన భజనలు చేస్తూనో .. పారాయణాలు చేస్తూనో ఆ రోజంతా గడపవలసి వుంటుంది. అయితే చాలామంది ఒకపూట భోజనం చేసి మరోపూట అల్పాహారం తీసుకోవడాన్ని ఉపవాసంగా భావిస్తూ వుంటారు. ఆరోగ్య రీత్యా అప్పుడప్పుడు ఉపవాసం చేయడం కూడా మంచిదేనని వైద్యశాస్త్రం చెబుతూ వుండటం వలన ఈ నియమం ఆ వైపు నుంచి కూడా బలపడిందని చెప్పవచ్చు.
సాధారణంగా స్త్రీలు ఎక్కువగా ఉపవాసాలు చేస్తుంటారు. ఇక పురుషులు తమ ఇష్టదైవానికి సంబంధించిన రోజున మాత్రమే ఉపవాసం చేస్తుంటారు. ఆయా రోజుల్లో చేసే ఉపవాసాలు ఆయా దైవాల అనుగ్రహాన్ని సంపాదించి పెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక్కో రోజున ఉపవాసం చేయడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయా ఫలితాలను పొందాలనుకునే వాళ్లు ఆయా రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్లు ఒక రోజు ... ఐశ్వర్యాన్ని ఆశించే వాళ్లు ఒకరోజు ఉపవాసాలు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో కీర్తిప్రతిష్ఠలు కావాలనుకునే వాళ్లు ఏ రోజున ఉపవాసం చేయాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అలాంటి వాళ్లు సోమవారం రోజున ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. సోమవారానికి అధిపతి చంద్రుడు కావడమే ఇందుకు కారణం. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపును కోరుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైన స్థానంలో నిలిపే కీర్తిప్రతిష్ఠలను ఆశిస్తారు. అలాంటి వాళ్లు ప్రతి సోమవారం రోజున ఉపవాసం చేయడం వలన చక్కని ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.