సంతోషాలనిచ్చే సాయి క్షేత్రం

సమస్యలను సహనంతో వినే ప్రేమమూర్తి ... అనురాగంతో అనుగ్రహించే అమృతమూర్తి సాయిబాబా. తన భక్తులను ఆదుకోవడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తుంటాడు. భక్తుల బాధలను తాను భరించడం ... వారి బాధ్యతలను తాను మోయడం బాబా ప్రత్యేకత. ఈ కారణంగానే భక్తులతో ఆయన బంధం ధృడంగా కనిపిస్తూ ఉంటుంది.
మానసికపరమైన చిరాకులు తొలగిపోవడానికీ ... మనసు ప్రశాంతంగా ఉండటానికి బాబా ఆలయానికి మించిన ఆధారం మరొకటి కనిపించదు. బాబా ఆప్యాయతను ఔషధంగా మార్చి అందించడంలో ఆయన ఆలయాలు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అలా నిర్మించబడిన ఆలయాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడాకి చెందిన 'హనుమాన్ పేట' ఒకటిగా కనిపిస్తుంది.
సువిశాలమైన ప్రదేశంలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడి బాబా ఆలయం అలరారుతుంటుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయం ... ప్రశాంత నిలయంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితమనే పోరాటంలో విజయం సాధించాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలనే విషయాన్ని బోధిస్తున్నట్టుగా బాబా కనిపిస్తుంటాడు. ఆయన కంటిచూపే మనసులోని అలజడిని మటుమాయం చేస్తుంటుంది. ప్రతి ఉదయం బాబాకి పూజాభిషేకాలు నిర్వహించబడుతుంటాయి.
ప్రతి గురువారం శిరిడీలో మాదిరిగానే అలంకారాలు ... హారతులు జరుగుతుంటాయి. ఎటు చూసినా భజనలు ... పారాయణాలు చేస్తూ భక్తులు కనిపిస్తుంటారు. పర్వదినాల సమయంలో ఆలయంలో మరింత సందడి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి బాబాను ఆరాధించడం వలన ఎంతోమంది భక్తులు ఆయా రంగాల్లో రాణించినట్టుగా అనుభవపూర్వకంగా చెబుతుంటారు.