హరిద్వార్

భక్తి మార్గంలో ప్రయాణించి చేరుకునే ముక్తి ద్వారమే 'హరిద్వార్'. హిమాలయ పర్వతాలను విష్ణుమూర్తి పాదాలుగా భావిస్తే ... ఆ పాదాల చెంతనే గంగమ్మ ప్రభవించింది. ఇక్కడ పంటకాలువలా ప్రవహించే గంగ ... ఆ తరువాత 'నీలధార' పేరుతో పరవళ్లు తొక్కుతుంది. సప్త మోక్షపురాల్లో ఒకటిగా భాసిల్లుతోన్న హరిద్వార్ ... పురాణాల్లో 'మాయాపురి' అనే పేరుతో కనిపిస్తుంది. హరిద్వారం ఎంతటి మహిమాన్వితమైనదనేది పురాణాలు ప్రస్తావించడం జరిగింది.
బృహస్పతి కుంభరాశిలోకి ... సూర్యుడు మేషరాశి లోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ 'కుంభమేళా' మహోత్సవం జరుగుతుంది. గంగానది తీరంలోనే గంగాదేవికి ఆలయం కూడా వుంది. ప్రతి రోజు సాయంత్రం అమ్మవారికి ఇక్కడ హారతి ఇస్తారు. పౌర్ణమి - అమావాస్యల్లోను, ఏకాదశి - గ్రహణ సమయాల్లోనూ ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దక్షప్రజాపతికి సంబంధించిన చరిత్ర మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది. సతీదేవి అగ్నికి ఆహుతి అయినది ఇక్కడేనంటూ 'కన్ ఖల్ ' అనే ప్రదేశాన్ని చూపుతుంటారు.
పవిత్రమైన ఈ ప్రదేశంలో స్నానాలు ఆచరించడమే కాకుండా, పితృ దేవతలకు తర్పణాలు వదులుతుంటారు. ఈ పుణ్య క్షేత్రానికి సమీపంలోనే దివ్య క్షేత్రమైనటువంటి 'ఋషికేశ్' విలసిల్లుతోంది. అందువలన హరిద్వార్ దర్శించుకున్న భక్తులంతా కూడా, ఆ తరువాత 'ఋషి కేష్' దర్శనార్థం వెళతారు. ఇక్కడ చలి ఎక్కువగా వుంటుంది కాబట్టి భక్తులు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఆధ్యాత్మిక చింతనలోని అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.