తిరుగుబాటుదారులతో ముఖాముఖీ తలపడి ప్రాణాలు పోగొట్టుకున్న చాద్ దేశాధ్యక్షుడు

20-04-2021 Tue 19:42
advertisement

ఆఫ్రికా చిరు దేశం చాద్ అధ్యక్షుడ్ని కోల్పోయింది. చాద్ దేశాధినేత ఇద్రిస్ దెబీ తిరుగుబాటుదారులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, చాద్ లో  మూడు దశాబ్దాల పాటు సాగిన ఇద్రిస్ దెబీ పాలన విషాదాంతం అయింది. తిరుగుబాటుదారులపై యుద్ధంలో స్వయంగా తుపాకీ చేతపట్టి రంగంలో దిగిన అధ్యక్షుడు తీవ్ర గాయాలతో కన్నుమూశారని చాద్ సైన్యం వెల్లడించింది.

ఇద్రిస్ దెబీ మరణం నేపథ్యంలో ఆయన కుమారుడు మహామత్ ఇద్రిస్ దెబీ ఇత్నో నేతృత్వంలో మధ్యంతర పాలన మండలి ఏర్పాటవుతుందని, 18 నెలల పాటు ఈ మండలి దేశ పాలన వ్యవహారాలు చేపడుతుందని సైన్యం తెలిపింది. రాజకీయ అధికారం సాఫీగా బదలాయింపు జరగడానికి ఈ మండలి తోడ్పడుతుందని వివరించింది.

ఇటీవలే చాద్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఇద్రిస్ దెబీ ఓటు కూడా వేశారు. ఈ ఎన్నికల్లో ఇద్రిస్ దెబీ విజయం సాధించారంటూ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన యుద్ధరంగంలో మరణించడం చాద్ దేశాన్నే కాకుండా, ఇతర ఆఫ్రికా దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. దెబీ పదవి నుంచి దిగిపోవాలని 2016 నుంచి తిరుగుబాటుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తరచుగా ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

కాగా, దేశాధ్యక్షుడే మరణించినా... సైన్యం మాత్రం అంతర్యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకుంటుండగా, గాయాలపాలైన అధ్యక్షుడు యుద్ధరంగం నుంచి తీవ్రగాయాలతో పారిపోయి మరణించాడని తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. దేశంలో 14 రోజులు సంతాపదినాలుగా పాటించాలని సైన్యం ఆదేశించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement