భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం: అమెరికా

20-04-2021 Tue 19:03
advertisement

కరోనా టీకా తయారీలో వినియోగించే ముడిపదార్థాల ఎగుమతులపై అమెరికాలో నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గం స్పందించింది.

భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. ఈ సమస్య పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో విధించిన ‘రక్షణ ఉత్పత్తుల చట్టం’ కారణంగానే ముడి పదార్థాలను స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపింది. అంతకు మించి ప్రత్యేకంగా ఎగుమతులపై నిషేధం ఏమీ లేదని స్పష్టం చేసింది.

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో వాడే కొన్ని ముడిపదార్థాలు అమెరికా నుంచి రావాల్సి ఉంది. కానీ, ఆ దేశంలో అమల్లో ఉన్న రక్షణ ఉత్పత్తుల చట్టం వల్ల వాటిని ఎగుమతి చేయలేకపోతున్నారు. ఈ చట్టం ప్రకారం దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ దేశానికి సరిపడా టీకాలు ఉత్పత్తి చేసేంత వరకు ముడిపదార్థాలను ఎగుమతి చేయడం కుదరదు.

దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ట్విటర్‌ వేదికగా బైడెన్‌కు సందేశం పంపారు. వీలైనంత త్వరగా నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరులో అందరం కలిసి ముందుకు సాగాలంటే నిషేధం ఎత్తివేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో తాజాగా బైడెన్ ప్రభుత్వం స్పందించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement